హైదరాబాద్ : ప్రజాసమస్యలను సభలో ప్రస్తావించి వాటిని పరిష్కరించే దిశలో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశంపార్టీ పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి రోశయ్య శనివారం విమర్శించారు. ఈసారి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చలు పూర్తిగా జరగలేదని రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సభను సజావుగా జరిపేందుకు తాను, స్పీకర్ కృషి చేసినా టీడీపీ సహకరించలేదని ఆయన మండిపడ్డారు.
అవసరమైన సమయంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, దీనిపై 22న సీఎం క్యాంప్ కార్యాలయానికి మారిన తర్వాత నిర్ణయించి, అధిష్టానానికి తెలియజేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫ్రీ జోన్ అంశంపై అన్ని పక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినందునే చర్చ జరపలేదని ఆయన అన్నారు.
హైదరాబాద్ : మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యుడు ఆజాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు శుక్రవారం వార్తలు వెలువడ్డాయి. అయితే ఇవన్నీ ఒట్టి వదంతులేనని, ఆజాద్ తమ అదుపులో లేడని డిజిపి గిరీష్‌కుమార్ స్పష్టం చేశారు.
పోలీసులు నాలుగు రోజుల క్రితం ఇద్దరు మావోయిస్టు ముఖ్య నేతలను రెండు వేరు వేరు ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టిన నేపథ్యంలో ఆజాద్ అరెస్టు వార్తలపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. టెక్ రమణ అలియాస్ సోలిపేట కొండలరెడ్డి ఎన్‌కౌంటర్ కావడానికి ముందు రెండు రోజుల క్రితం మహారాష్ట్రలో అరెస్టయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పోలీసులు ఖండించారు. ఆ తర్వాత రెండు రోజులకు వరంగల్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో టెక్‌రమణ మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. దీనితో ఇప్పుడు ఆజాద్ అరెస్టుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. అదీగాక ఈ ఉదయం ఖమ్మం జిల్లాలోని వాజేడు-వెంకటాపురం అటవీ ప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వీరివద్ద నుంచి రెండు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఆజాద్ ఇక్కడే పట్టుబడి వుండవచ్చనే ఊహాగానాలు బయలుదేరాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రీన్‌హంట్ ఆపరేషన్ ప్రారంభం కావడంతో నల్లమలతో పాటు ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల్లో మళ్ళీ పట్టుబిగించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మావోయిస్టుల సంచారం మళ్ళీ మొదలయ్యింది. అయితే కేంద్ర హోం శాఖ సూచనలతో ఎప్పటికప్పుడు రాష్ట్ర పోలీసులు చురుగ్గా కదులుతున్నారు. విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టు కార్యకలాపాలకు చెక్ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అగ్రనేత ల్లో ఒకరైన ఆజాద్ ఉనికిని గుర్తించి పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలొస్తున్నాయి.
గంటలహైదరాబాద్ : ముఖ్యమంత్రి రోశయ్య ఈనెల 22వ తేదీన సీఎం క్యాంప్ కార్యాలయానికి మారనున్నారు. ఆ రోజు ఉదయం 8.46 కు ముహూర్తం నిర్ణయించారు.
తొలుత 25వ తేదీన మారవచ్చునని సమాచారం వచ్చినప్పటికీ ఆరోజు ముహూర్తం బాగోలేనందున 22వ తేదీకి ముహూర్తం పెట్టినట్లు తెలియవచ్చింది.
దివంగిత రాజశేఖర్‌రెడ్డి మృతి చెందిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఇప్పటివరకు క్యాంప్ కార్యాలయంలో అడుగుపెట్టలేదు. 22 నుంచి రోశయ్య అధికార బాధ్యతలు క్యాంప్ కార్యాలయం నుంచే నిర్వహిస్తారు.
న్యూఢిల్లీ : ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీకి అధిష్ఠానం నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని బుధవారం నాడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ వీరప్ప మొయిలీ ధ్రువీకరించారు. ఉప ఎన్నికలపై త్వరలోనే కసరత్తు పూర్తిచేస్తామని ఆయన వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణపై రోశయ్య ప్రతిపాదనలతో వస్తే చర్చిస్తామని విలేఖర్లు అడిగిన ఓ ప్రశ్నకు వీరప్ప మొయిలీ సమాధానం ఇచ్చారు. ఏప్రిల్‌లో తిరిగి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాలలో మహిళా బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. బిసి లెక్కలు అందుబాటులో లేనందుకు ఆయా వర్గాల మహిళలకు రిజర్వేషన్ల కోటా ఇప్పట్లో వీలు పడదని ఆయన తేల్చిచెప్పారు. ఫ్రీజోన్ అంశంపై సుప్రీం కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత పరిశీలించి అభిప్రాయం చెబుతానని వీరప్ప మొయిలీ తెలిపారు.
హైదరాబాద్ : వికృతినామ సంవత్సరంలో రాష్ట్రంలో వర్షాలు సకాలంలోపడి, పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి రోశయ్య ఆకాంక్షించారు. రవీంద్రభారతిలో మంగళవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, 2010-11 పంచాంగాన్ని ఆవిష్కరించారు. వికృతినామ సంవత్సరంలో రాష్ట్రంలో జరగబోయే భవిష్యత్ పరిణామాలపై ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు.
మంగళవారం ఉగాది వచ్చినా అశుభం కాదు... మంగళవారం శుభప్రదమైన వారంగా ఆయన అభివర్ణించారు. వికృతినామ సంవత్సరంలో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి, వ్యవసాయం బాగుంటుందవు వివరించారు. రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని వ్యాపార, షేర్‌మార్కెట్లలో ఒడిదుడుకులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఐటీ పరిశ్రమకి మంచిరోజులు వస్తాయని, నిత్యావసరాల ధరలు చుక్కలనంటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పాలకులు చిత్తశుద్ధి కలిగి ఉండాలని, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేదని రామలింగేశ్వర సిద్ధాంతి వివరించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని సూచించారు. మామిడిపండ్ల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండవని, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గడ్డుకాలమని జోస్యం చెప్పారు. వేసవి కాలం తీవ్రంగా ఉంటుందని, మన క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తారన్నారు. రాష్ట్రంలో అరుదైన భూగర్భవనరులు లభిస్తాయని సిద్ధాంతి పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు.
మొత్తంమీద రాష్ట్రంలో గత ఏడాది కంటే ఈ ఏడాది కలిసివస్తుందని సిద్ధాంతి పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేద పండితులకు ముఖ్యమంత్రి ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు గీతారెడ్డి, గాదె వెంకటరెడ్డి, దానం నాగేందర్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్నది కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ మార్పులకు అధిష్ఠానవర్గం అనుమతించినట్లయితే ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒకరికి అప్పగించడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. శాసనసభా నాయకురాలు, సమాచార శాఖ మంత్రి జె గీతారెడ్డి, మాజీ హోంమంత్రి కె జానారెడ్డి, పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్. ఈ ముగ్గురులో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని అంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ మార్పులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె రోశయ్య నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ కార్యక్రమాన్ని ముగించాలని ముఖ్యమంత్రి అనుకున్నా రాజకీయ వాతావరణం అనుకూలించని కారణంగా అసెంబ్లీ సమావేశాల తర్వాతకు వాయిదా వేశారు. ప్రత్యేక తెలంగాణ వాదన గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని అధిష్ఠానవర్గం భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజనపై కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటి డిసెంబర్ నాటికి తన నివేదికను ఇవ్వనుంది.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పదవిని ఎవరికి ఇవ్వాలన్నది అధిష్ఠానవర్గం నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి ముఖ్యమంత్రి పదవి దళితునికి దక్కుతుందంటూ తెరాస అధినేత కెసిఆర్ గతంలో చేసిన ప్రకటనను కూడా అధిష్ఠానవర్గం దృష్టిలో పెట్టుకునే ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండే వారినే రాష్ట్ర విభజన జరపాల్సి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి లభించే అవకాశం ఉందన్నది విశే్లషిస్తే ప్రస్తుతం మంత్రిగా ఉన్న జె గీతారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీనియర్ మంత్రి, మహిళ అందులోను ఎస్సీ వర్గాలకు చెందిన వారు కావడం, అధిష్ఠానవర్గ ప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉండటం గీతారెడ్డికి కలిసి వచ్చే అంశాలు. ముఖ్యమంత్రి రోశయ్యతో కూడా అమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. అందువల్లనే గీతారెడ్డికి శాసనసభా నాయకురాలి పదవిని ముఖ్యమంత్రి రోశయ్య కట్టబెట్టారు.
మంత్రివర్గ విస్తరణ జరిగితే కె జానారెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయ జెఎసిలో కాంగ్రెస్ తరఫున మొదట కీలక పాత్ర వహించిన జానారెడ్డి అధిష్ఠానవర్గం ఆదేశం మేరకు ఆ తర్వాత క్రమంగా జెఎసి కార్యకలాపాలకు దూరమయ్యారు. తెరాసతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలని నిర్ణయించగా అధిష్ఠానం ఆదేశం మేరకు రాజీనామాలకు దూరంగా ఉంటున్నట్లు ముందుగా జానారెడ్డి ప్రకటించారు. కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డికి సన్నిహితుడు, సీనియర్ నాయకుడు కావడం జానారెడ్డికి కలిసి వచ్చే అంశాలు.
ఇక పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ విషయానికి వస్తే ఆయన హైదరాబాద్ నుంచి స్థానిక సంస్ధల ద్వారా శాసనమండలికి జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేయవచ్చని , ఇందుకు అధిష్ఠానవర్గం కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే నెలలో మంత్రివర్గ మార్పులు జరిగే సమయానికి శ్రీనివాస్ శాసనమండలికి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. శ్రీనివాస్ శాసనమండలికి ఎన్నికైన పక్షంలో మంత్రివర్గంలోకి రావడం ఖాయం. అయితే శ్రీనివాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టే విషయంలో కొన్ని అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య శాసనమండలి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీనివాస్ కూడా శాసనమండలి నుంచే ఎన్నికయ్యే అవకాశం ఉందని భావిస్తున్నందున అయనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు రెండూ శాసనమండలి నుంచి ఎన్నికైన వారికే దక్కుతాయి. ఇది ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి దారి తీయవచ్చు. తెరాసకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాల కారణంగా ఖాళీ అయిన స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.
కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న మరో వాదన ప్రకారం ముందుగానే శ్రీనివాస్‌ను మంత్రిమండలిలోకి తీసుకుని ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతారు. మంత్రిపదవి చేపట్టిన ఆరు నెలల్లో ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావలసి ఉంటుంది. ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఈ లోగానే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి నిజామాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో శ్రీనివాస్‌ను నిలబెట్టవచ్చని భావిస్తున్నారు. కానీ ఇందుకు శ్రీనివాస్ అంత సుముఖంగా లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ ఇదే స్థానం నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన బిజెపి అభ్యర్థి లక్ష్మీనారాయణ ఇక్కడ మళ్ళీ పోటీ చేయనున్నారు. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు ఎక్కువగా ఉన్నందున సహజంగానే రాజీనామా చేసిన అభ్యర్థికి అనుకూలంగానే ప్రజలు స్పందించే అవకాశం ఉందని శ్రీనివాస్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆయన అయితే శాసనమండలికి లేదంటే రాజ్యసభకు వెళ్ళాలని అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ పునర్వవస్ధీకరణ పైన మంత్రులు, ఎమ్మెల్యేల మధ్యన ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మార్పులు చేర్పులు అనివార్యం అని అత్యధికులు భావించారు. మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు యువ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కె. రోశయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇద్దరు ముగ్గురు మాజీలు కూడా మంత్రిపదవుల పై ఆసక్తిని కనబరిచారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు సీనియర్ మాజీ మంత్రులు మంత్రివర్గ పునర్వవస్ధీకరణపై అత్యంత ఆసక్తిని కనబరిచారు.
ముఖ్యమంత్రిగా రోశయ్య ఆరు మాసాల క్రితం బాధ్యతలు స్వీకరించినప్పటీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు చేయకుండానే పరిపాలన సాగిస్తున్నారు. రాజశేఖర రెడ్డి మంత్రివర్గం రోశయ్యకు సహకరించడం లేదని ప్రచారం జరిగింది. తామంతా సమిష్టి బాధ్యతలో ఉన్నామని, ముఖ్యమంత్రికి సహకరించడం లేదనేది ప్రచారమే తప్ప వాస్తవం కాదని పలువురు మంత్రులు బహిరంగంగా ప్రకటించారు. కొందరు మంత్రులు రాజీనామా చేయడం, మరి కొందరు సహయ నిరాకరణ పాటించడం లాంటి పరిణామాలపై కూడా చర్చ జరిగింది.
సుదీర్ఘ కాలంపాటు సచివాలయంలోని ఛాంబర్‌కు రాని మంత్రుల గురించి కూడా చర్చించుకున్నారు. జగన్ నాయకత్వాన్ని బలపరుస్తు, రోశయ్య మంత్రివర్గంలో కొనసాగలేనని మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖకు తిరిగి మంత్రివర్గంలో స్ధానం కల్పిస్తారా లేదా అనే దిశగా చర్చలు సాగాయి. సురేఖకు మంత్రి పదవి ఇస్తే తప్పులేదని కొందరు వాదించగా, తిరుగుబాటు చేసిన వారికంటే కూడా రోశయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసే వారిని మంత్రివర్గంలోకి తీసుకొనడం మంచిదని మరికొందరు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వేర్పాటు వాద ఉద్యమాలు కొనసాగుతున్నందున మంత్రివర్గం పునర్వవస్ధికరణలో పెద్దగా మార్పులు ఉండక పోవచ్చని, కొత్త వారిని చేర్చుకొనడంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానం అనుసరించే అవకాశం ఉందని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.
తెలంగాణ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందని అన్నారు. మంత్రివర్గంలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు, వర్గాలకు సముచిత స్ధానం కల్పించడం కూడా ప్రధానం అని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఏప్రిల్ తొలి వారంలోనే మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ ఉండవచ్చని పలువురు సీనియర్లు తెలిపారు. ప్రస్తుత మంత్రుల శాఖలు కూడా చాలా వరకు మారుతాయని అభిప్రాయపడుతున్నారు. సమర్ధ పాలనకు శాఖల వారిగా పనితీరే ప్రామాణికం అని ముఖ్యమంత్రి భావిస్తున్నందున మంత్రుల శాఖలు మారే అవకాశం ఉందని చెప్పారు.
ఇద్దరు ముగ్గురు మహిళా మంత్రుల పనితీరును ఇప్పటికే పరిశీలించారని, మరో నలుగురు మంత్రుల శాఖల్లో ఏ మాత్రం మెరుగుదల లేదని ముఖ్యమంత్రి భావించినట్లు పేర్కొన్నారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశాన్ని కొట్టి పారేయలేమని చెప్పారు. రోశయ్య మంత్రివర్గంలో 33 మంది మంత్రులు ఉన్నారు. కొత్తగా నలుగురికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఉన్నవారిలో ఎవరిని తొలగించినా సమస్యలు ఉత్పన్నం అవుతాయని పేర్కొన్నారు. రోశయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసే వారితోనే మంత్రివర్గం పునర్వస్ధీకరించవలసి ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల సంయుక్త కార్యచరణ కమిటీ (జెఎసి) నుంచి తెలుగుదేశం పార్టీని జెఎసి బహిష్కరించింది. టిడిపి అధినేత చంద్రబాబు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ నిరసన తెలియజేయడానికి వెళ్లిన జెఎసి నేతలను ఆ పార్టీ నాయకులు పోలీసులతో అరెస్టు చేయించటంతో ఆగ్రహం చెందిన జెఎసి ఈ నిర్ణయం తీసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరగిన సంఘటనపై అత్యవసరంగా శుక్రవారం రాత్రి జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. జెఎసిలో కొనసాగుతూనే జెఎసి పట్ల టిడిపి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ చర్య తీసుకున్నట్టు కోదండరామ్ మీడియాకు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన సంఘటనతో పాటు ఇటీవల ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ న్యాయవాదలపై టిడిపి కార్యకర్తల దాడి, జెఎసి ఇచ్చిన రాజీనామాల పిలుపును విస్మరించడం తదితర సంఘటనలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఆ పార్టీని జెఎసి నుంచి బహిష్కరించినట్టు కోదండరామ్ పేర్కొన్నారు. జెఎసి నుంచి కాంగ్రెస్ బయటికి వెళ్లినప్పటి నుంచి జెఎసిని టార్గెట్‌గా చేసుకొని టిడిపి తెలంగాణ నేతలు జెఎసిని విమర్శించటాన్ని జెఎసి తీవ్రంగా పరిగణించింది. జెఎసిలోనే ఉంటూ జెఎసికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న టిడిపిపై చర్య తీసుకొవాలని జెఎసి అత్యవసర సమావేశానికి హాజరైన ప్రజాసంఘాలన్ని పట్టుబట్టడంతో ఈ చర్య తీసుకున్నట్టు జెఎసి నేతలు పేర్కొన్నారు. జెఎసి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందే వైదొలగిన విషయం తెలిసిందే.ప్రస్తుతం జెఎసిలో తెరాస, ప్రజాసంఘాలు మాత్రమే ఉన్నాయి.
వాషింగ్టన్, మార్చి 12: అమెరికాకు చెందిన, ది అప్పీల్ ఆఫ్ కాన్సియన్స్ ఫౌండేషన్ భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను 2010 సంవత్సరానికి ప్రతిష్టాత్మక వరల్డ్ స్టేట్స్ మాన్ అవార్డుకు ఎంపిక చేసింది.ఈ అవార్డును ప్రధానికి వచ్చే సెప్టెంబర్ నెలలో అందచేస్తామని, మాజీ అంతరంగిక శాఖ సహాయమంత్రి జాన్ నెగ్రొపొంటే తెలిపారు. అమెరికాలో భారత్ రాయబారి మీరా శంకర్ ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రధాని ఈ అవార్డును స్వీకరించడానికి దయతో అంగీకరించారని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఇప్పటి వరకు స్వీకరించిన వారిలో బ్రిటి ష్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ (2009), ఫ్రాన్స్ అధ్యక్షుడు నికొలస్ సర్కొజీ (2008), జర్మన్ ఛాన్సలర్ అంజెల మార్కెల్ (2007), బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియొ లూలా డ సిల్వ (2006) వున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల సంయుక్త కార్యచరణ కమిటీ (జెఎసి) నుంచి తెలుగుదేశం పార్టీని జెఎసి బహిష్కరించింది. టిడిపి అధినేత చంద్రబాబు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ నిరసన తెలియజేయడానికి వెళ్లిన జెఎసి నేతలను ఆ పార్టీ నాయకులు పోలీసులతో అరెస్టు చేయించటంతో ఆగ్రహం చెందిన జెఎసి ఈ నిర్ణయం తీసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో జరగిన సంఘటనపై అత్యవసరంగా శుక్రవారం రాత్రి జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. జెఎసిలో కొనసాగుతూనే జెఎసి పట్ల టిడిపి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ చర్య తీసుకున్నట్టు కోదండరామ్ మీడియాకు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన సంఘటనతో పాటు ఇటీవల ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ న్యాయవాదలపై టిడిపి కార్యకర్తల దాడి, జెఎసి ఇచ్చిన రాజీనామాల పిలుపును విస్మరించడం తదితర సంఘటనలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఆ పార్టీని జెఎసి నుంచి బహిష్కరించినట్టు కోదండరామ్ పేర్కొన్నారు. జెఎసి నుంచి కాంగ్రెస్ బయటికి వెళ్లినప్పటి నుంచి జెఎసిని టార్గెట్‌గా చేసుకొని టిడిపి తెలంగాణ నేతలు జెఎసిని విమర్శించటాన్ని జెఎసి తీవ్రంగా పరిగణించింది. జెఎసిలోనే ఉంటూ జెఎసికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న టిడిపిపై చర్య తీసుకొవాలని జెఎసి అత్యవసర సమావేశానికి హాజరైన ప్రజాసంఘాలన్ని పట్టుబట్టడంతో ఈ చర్య తీసుకున్నట్టు జెఎసి నేతలు పేర్కొన్నారు. జెఎసి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందే వైదొలగిన విషయం తెలిసిందే.ప్రస్తుతం జెఎసిలో తెరాస, ప్రజాసంఘాలు మాత్రమే ఉన్నాయి.
Loading Poll...