న్యూఢిల్లీ: యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం రెండోసారి పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయన సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం సాయంత్రం రేస్ కోర్స్ రోడ్డులోని తమ నివాసంలో యు.పి.ఏ కూటమి ఎంపీలు, మంత్రులకు ఏర్పాటు చేసిన విందు సమావేశానికి మిత్ర పక్షాల నాయకులు హాజరవుతారా? తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, రైల్వే మంత్రి మమతా బెనర్జీ, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ , సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌లను కూడా మన్మోహన్ ఆహ్వానించారు. యుపిఏ మిత్రపక్షాలకు చెందిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు విందుకు హాజరవుతారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు రిజర్వు చేయటంలో బిసి మహిళలకు సబ్‌కోటా కల్పించనందుకు యాదవ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. జనగణనలో బిసి కులాల వివరాలు సేకరించే అంశాన్ని మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మన్మోహన్ సింగ్ లోక్‌సభలో చేసిన ప్రకటన ఇంత వరకు ఆచరణలోకి రానందుకు ములాయం, లాలూ అసంతృప్తితో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక పోవటంతో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య ఇటీవల దూరం పెరిగింది. దీంతో మన్మోహన్ ఇస్తున్న విందు సమావేశానికి హాజరు కాకూడదని మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలియగానే ప్రధాని రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించే యత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆయన స్వయంగా మమతా బెనర్జీకి టెలిఫోన్ చేసి పిలవగా ఆమె మనసు మారుతోందని అంటున్నారు.
ఇక విందుకు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లను ఆహ్వానించటం పై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళాబిలులపై యాదవ త్రయం చేసిన రచ్చను వారు గుర్తు చేస్తున్నారు. విపక్షాలు లోక్‌సభలో ప్రవేశ పెట్టిన కోత తీర్మానాలు వీగిపోయన నేపథ్యంలోనే ములాయం, లాలూను విందు సమావేశానికి సోనియా గాంధీ ప్రత్యేకంగా ఆహ్వానించారని చెబుతున్నారు. సోనియా చొరవ వల్లే జనగణనలో బి.సిల వివరాలు సేకరించే విషయాన్ని మంత్రివర్గంలో పరిశీలిస్తామని మన్మోహన్ లోక్‌సభలో హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఐదేళ్ళూ ఉండాలంటే లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌ల మద్దతు ఎంతో అవసరమని సోనియా విశ్వసిస్తున్నట్టు తెలిసింది.
Loading Poll...