న్యూఢిల్లీ : తన పదవికి ఎటువంటి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి ఎంత భీష్మించుకొని కూర్చున్నా, తనకు ఉద్వాసన తప్పదని ఆయన గ్రహింపునకు వచ్చారు. ఈ నేపధ్యంలోనే ఆయన బుధవారం మండలి సభ్యులకు ఈమెయిల్ ఒకటి పంపుతూ ఐపిఎల్ పాలక మండలి సమావేశాన్ని ఈనెల 26న కాకుండా వచ్చేనెలకు వాయిదా వేయాలని కోరడమే కాకుండా, దీనికి అసలు విలువలేదని వ్యాఖ్యానించినట్టు ఐపిఎల్ వర్గాలు తెలిపాయి. పదిరోజుల క్రితం తాను భాగస్వాముల పేర్లు బయటపెడతానని చెప్పినా, బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, అరుణ్ జైట్లీ, మండలి సభ్యులు తనను వారించారని తన మెయిల్‌లో పేర్కొన్నట్టు వారు వివరించారు. ఒక సందర్భంలో బిసిసిఐ సమావేశానికి తాను హాజరుకాబోనని కూడా హెచ్చరించినట్టు సమాచారం.
ఐతే బిసిసిఐ మాత్రం ఈ బెదిరింపులకు లొంగే పరిస్థితి కనిపించడంలేదు. మోడి హాజరు కాకపోయినా సమావేశం జరుగుతుందని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. అసలు మోడి తనకు తానుగా రాజీనామా చేసే పరిస్థితి లేకపోవడంతో, బిసిసిఐ మోడి ఉద్వాసనకు వ్యూహ రచనకు ఉపక్రమించింది. ఇప్పటికే ట్వంటీ 20పై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపధ్యంలో రాజీనామా చేయాలని మోడికి సంకేతాలు వెళ్ళాయి. దుబాయ్‌లో ఐసిసి సమావేశంలో పాల్గొని మంగళవారం సాయంత్రం ముంబయికి తిరిగి వచ్చిన మోడి, పాలక మండలి సమావేశంలో తన వాదనను వినిపించడానికే సిద్ధమని ప్రకటించారు. పోరు సలపకుండా రాజీనామా చేయడానికి మోడి సిద్ధపడకపోవడంతో ఇప్పటికే రగులుతున్న వివాదంలో మరింత ఆజ్యం పోసినట్టయి పరిస్థితి మరింత సంక్లిష్టరూపం దాల్చింది. ‘మోడి తనకు తానే పదవినుంచి తప్పుకొనేలా లేరు. మరి అటువంటప్పుడు ఆయన్ను తొలగించాలని పాలక మండలి నిర్ణయించిన నేపధ్యంలో తప్పనిసరిగా కొంత ఉద్వేగ పరిస్థితి నెలకొనడం సహజం,’ అని బిసిసిఐ వర్గాలు పేర్కొన్నాయి.ప్రభుత్వం నుంచి తీవ్ర వత్తిడి వచ్చిన నేపధ్యంలో బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, మోడికి మొదట్నుంచీ మద్దతిస్తూ వస్తున్న శరద్ పవార్ కూడా కాడి కిందపడేయక తప్పలేదు. అదీ కాకుండా బోర్డులో మోడికి వ్యతిరేకంగా లాబీయింగ్ తీవ్రస్థాయిలో కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది.
ఈ సంక్షోభం నుంచి బయటపడే అన్ని మార్గాలు మూసుకు పోయినట్టే! ఇక మోడి ఎవరినీ ఖాతరు చేయడం లేదని తేలిపోవడంతో అప్పటి వరకు శాంతంగా వున్న బిసిసిఐ కూడా మీడియా ఎదుట కఠినంగా మాట్లాడటం ప్రారంభించింది. ఈ నేపధ్యంలోనే ఆర్థిక కమిటి ఛైర్మన్ రాజీవ్ శుక్లా విలేకర్లతో మాట్లాడుతూ, ‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐపిఎల్ పాలక మండలి సమావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు,’ అంటూ హెచ్చరించారు. ‘ఎవరైనా దిగిపోవడానికి నిరాకరిస్తున్నారా లేదా అన్నది కాదు ప్రశ్న. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, శరద్ పవార్‌లు మంగళవారం సమావేశమయ్యారు. ఏప్రిల్ 26న ఐపిఎల్ పాలక మండలి సమావేశంలో కూర్చుని కలిసి చర్చించి ఏం చేయాలనేది ఏకగ్రీవంగా నిర్ణయించాలని వారు ఒక అభిప్రాయానికి వచ్చారు,’ అని రాజీవ్ శుక్లా తెలిపారు. ‘ ఈ నిర్ణయాలన్నీ కూడా క్రికెట్, బిసిసిఐలకు ఇప్పటి వరకు వున్న హోదాను కాపాడటానికే. నిర్ణయాలు ఎంత కఠినంగా వున్నప్పటికీ అవి కేవలం బిసిసిఐ, క్రికెట్‌కు దేశంలో వున్న అభిమానాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా చూసేందుకే. గత 60 సంవత్సరాల కాలంలో మేం ఈ విషయంలో మేం ఏమాత్రం రాజీ పడలేదు. భవిష్యత్తులో కూడా అటువంటిది జరగబోదు,’ అని శుక్లా స్పష్టం చేసారు. ఈ పరిణామాల నేపధ్యంలో మోడి ఉద్వాసన తప్పదని తేలిపోయింది!
Loading Poll...