న్యూఢిల్లీ : భారతదేశం గురువారం నాడు బృహత్తర జనగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా 102కోట్లకు పైగా ఉన్న జనాభాను చుట్టివచ్చే ఈ మహాక్రతువును రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌తో మొదలు పెట్టారు. దశాబ్దానికి ఒకసారి భారతదేశంలో జనాభాను లెక్కిస్తారు. తాజాగా ప్రారంభమైన జాతీయ జనగణన కార్యక్రమంలో 25లక్షల మంది అధికారులు పాలు పంచుకోనున్నారు. పౌరుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక తదితర నేపథ్యాలతో కూడిన సమాచారాన్ని సేకరించి, జాతీయ జనాభా రిజిష్టర్‌ను రూపొందిస్తారు. ‘జాతీయ జనగణన తయారీలో నా దేశ సోదర, సోదరీ మణులందరూ పెద్ద మనసు చేసుకుని భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
ఇది జాతి యావత్తుతో పాటు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది’ అని రాష్టప్రతి భవన్‌లో అధికారులు తన పేరును నమోదు చేసుకున్న తరువాత రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ దేశ ప్రజలకు సందేశాన్నిచ్చారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి పి. చిదంబరంతో పాటు రిజిస్ట్రార్ జనరల్, జన గణన కమిషనర్ సి. చంద్రమౌళి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, జాతీయ జనాభా రిజిస్ట్రార్ ఎస్‌కే చక్రవర్తి పాల్గొ న్నారు. హోంమంత్రి చిదంబరం మాట్లాడుతూ 102కోట్ల మంది జనాభాను లెక్కించిన తరువాత, గుర్తింపు కార్డులు సమకూర్చనుండడం మానవాళి చరిత్రలోనే ఇది మొదటి సారి అన్నారు. ‘ఈ కార్యక్రమం తప్పకుండా విజయవం తం కానుంది. దేశవ్యాప్తంగా ఏ ఒక్క గ్రామాన్ని వదల కుండా లెక్కగడతాం’ అని చిదంబరం స్పష్టం చేశారు.
రూ. 2,209కోట్ల ఖర్చు...
అతిపెద్ద ఈ జనగణన కార్యక్రమానికి రూ. 2, 209కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ సారి జాతీయ జనాభా రిజిష్టర్(ఎన్‌పీఆర్)లో వ్యక్తుల నుంచి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం ఇతర అంశాలతో కూడిన సమాచారాన్ని కూడా అధికారులు సేకరించనున్నారు. కులపరంగా జనాభాను లెక్కించడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘పూర్తి సమాచారంతో కూడిన ఒక ప్రత్యేక ఫారాన్ని నింపి, రశీదును ఇస్తాం. సమాచారాన్ని అంతా సేకరించి డిజిటలైజ్ చేస్తాం. దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి రశీదులు చూపెట్టిన వారందరి వేలి ముద్రలు, ఫొటోగ్రాఫ్‌లు సేకరిస్తాం’ అని చక్రవర్తి వెల్లడించారు. వేలిముద్రలను భారత విశిష్ట గుర్తింపు సంస్థకు అందజేస్తామని ఆయన తెలిపారు. ఎన్‌పీఆర్ ద్వారా దేశ జనాభా అంతా ఒకే డాటాబేస్ కిందికి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
రెండు దశల్లో జనగణన...
జనాభా లెక్కల కార్యక్రమ విధానాలను కమిషనర్ చంద్రమౌళి వెల్లడించారు. జనగణను రెండు దశలలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మొదటి దశ ఏప్రిల్-జూలై నెలల మధ్య ఉంటుందన్నారు. గృహాల జాబితా ఆధారంగా లెక్కిస్తామన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సౌకర్యాన్ని బట్టి ఇది ఉంటుందన్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలు పెట్టిన 45రోజుల్లో పూర్తిచేస్తామని ఆయన స్పష్ట చేశారు. 2011 సంవత్సరం ఫిబ్రవరి 9నుంచి 28వరకు రెండోదశ ఉంటుందని చంద్రమౌళి తెలిపారు. జనాభా సరళగణనగా పిలుచుకునే ఈ దశను దేశవ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహిస్తారు. మొత్తం క్రతువు మార్చి 5నాటికి పూర్తవుతుంది. 640జిల్లాలు, 5, 767 తెహసిల్‌లు, 7, 742 పట్టణాలు, 6లక్షలకు పైగా గ్రామాలను చుట్టివస్తూ ఈ మహాయజ్ఞం పూర్తి కానుంది.
Loading Poll...