హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ బుధవారంనాడు లక్ష్మీపార్వతిని ఆమె నివాసంలో కలుసుకున్నారు. సుమారు గంటసేపు వారి ఇద్దరి మధ్యా చర్చలు జరిగాయి. అయితే, ఈ భేటీలో తమ ఇద్దరి మధ్యా కుటుంబ విషయాలు, గత స్మృతులు నెమరు వేసుకున్నామని లక్ష్మీపార్వతి మీడియాకు తెలిపారు. తన బిడ్డ బాలయ్యబాబు ఫోన్ చేసి తనను చూసేందుకు వస్తున్నానని చెప్పగానే తాను సంతోషంతోను, ఆనందంతోనూ అవాక్కయ్యానని ఆమె చెప్పుకున్నారు. బాలకృష్ణ కుటుంబాన్ని ఉగాది రోజున తన ఇంటికి ఆహ్వానించినట్లు చెప్పారు. బాలకృష్ణ చాలా మంచివాడని, అన్ని విషయాల్లోనూ మంచి పరిపక్వత కనబరుస్తాడన్నారు. బాలకృష్ణ తన వద్దకు వచ్చిన సందర్భంగా తాను చాలా ఉద్వేగంగా ఫీలయ్యానన్నారు. అయితే, తమ మధ్య రాజకీయ సంబంధమైన చర్చలేవీ జరగలేదన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ, 'మా అమ్మను చూసేందుకు వచ్చాను. ఇకపైన కూడా వస్తూనే ఉంటాను. ఆప్యాయతలు, అనురాగాలు పంచుకోవడానికే వచ్చాను. మా మధ్య అపోహలు తొలగిపోయాయం'టూ బాలకృష్ణ పేర్కొన్నారు. ఇద్దరం కలిసి ఎన్టీఆర్ ఆశయాలను నిజం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎన్టీఆర్ పేరున ఒక చిరస్మరణీయమైన కార్యక్రమం నిర్వహించానుకున్నామని లక్ష్మీపార్వతి అన్నారు. త్వరలోనే ఓ మంచి కార్యాచరణతో బాలకృష్ణ, తాను మీడియా ముందుకు వస్తామన్నారు. ఎన్టీఆర్ పేరుతో ఆయన సామాన్లను భద్రపరుస్తూ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. బసవతారకం మెమోరియల్ క్యాన్సర్ ఆస్పత్రిని మరింతగా అభివృద్ధి చేయాలని బాలకృష్ణ నిశ్చయంతో ఉన్నారని లక్ష్మీపార్వతి సూచనప్రాయంగా తెలిపారు.
కాగా, ఎన్టీఆర్ మరణించిన ఇన్నేళ్ళకు లక్ష్మీపార్వతితో బాలకృష్ణ భేటీలో ఏదో అంతరార్థం ఉండే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లక్ష్మీపార్వతిని రెండో పెళ్ళిచేసుకున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించినప్పటి నుంచీ ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఆమెను తమ కుటుంబ సభ్యురాలిగా పరిగణించలేదు. ఇన్నేళ్ళకు బాలకృష్ణ ఆమె నివాసానికి రావడం వెనుక ఆస్తుల తగాదాలకు సంబంధించిన కోర్టు కేసుల అంశమో లేక చంద్రబాబు వ్యూహమో ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి తనను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోయినా, ఆస్తుల విషయంలో, ఎన్టీఆర్ మెమోరియల్ విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినా లక్ష్మీపార్వతి ఏనాడూ వారిని దూషించలేదు. తప్పు పట్టలేదు. తన భర్త ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం అంటూ అమె నిప్పులు చెరిగారు. చంద్రబాబు మాయలో పడి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మోసపోతున్నరంటూ వాపోయారు. అలాగే, బాలకృష్ణ ఇంటిలో కాల్పుల ఘటన, ఆ సంఘటనలో గాయపడిన బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందినప్పుడు లక్ష్మీపార్వతి వెళ్ళి పరామర్శించి వచ్చారు.
న్యూఢిల్లీ : దేశంలోని మూడు నగరాలకు తీవ్రవాదుల నుండి ముప్పు పొంచి ఉందని కేంద్ర హోంమంత్రత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోల్ కత్తా, ముంబయి,. బెంగళూరు నగరాలపై తీవ్రవాదులు ఏ సమయంలోనైనా విరుచుకుపడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసి అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు హోంశాఖ సూచించింది. ముఖ్యంగా విదేశీయులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా చేపట్టాలని రాష్ట్రాలకు పంపిన ఆదేశాల్లో పేర్కొంది.
ఇటీవల అహ్మదాబాద్, జైపూర్ పేలుళ్ల కేసులో నిందుతుడైన ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన సల్మాన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ ను విచారించగా హోంత్రిత్వ శాఖకు కీలక సమాచారం లభించింది. ఐఎస్ఐ సంస్థలో శిక్షణ పొందిన తీవ్రవాదులు భారత్ పై దాడులు చేసేందుకు 'కరాచీ ప్రాజెక్టు' పేరిట రంగంలోకి దిగుతున్నట్లు సల్మాన్ విచారణలో ధృవీకరించాడు. తీవ్రవాదులు కరాచీ, ఖట్మాండ్, దుబాయ్ లలో స్థావరాలు ఏర్పాటు చేసి దాడులకు వ్యూహం పన్నుతున్నట్లు సల్మాన్ పోలీసుల ముందు అంగీకరించాడు. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు రాష్ట్రాల్లో విదేశీయులు ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కరాచీ ప్రాజెక్టును చేపడుతున్నట్లు పోలీసులు పసిగట్టారు. కరాచీ ప్రాంతంలోని తీవ్రవాదుల శిక్షణ స్థావరానికి అమీర్ రాజా ఖాన్ కన్వీనర్ గా నేతృత్యం వహిస్తున్నాడని విచారణలో సల్మాన్ వెల్లడించాడు. అలాగే భట్కల్ సోదరులైన రియాజ్, ఇక్బాల్ లు శిక్షణా కేంద్రానికి ఇన్ ఛార్జులుగా వ్యవహరిస్తున్నారని, మరో భారతీయ యువకుడు కూడా ఉన్నాడని పోలీసులు ముందు సల్మాన్ అంగీకరించాడు.
అయితే సల్మాన్ వెల్లడించిన అంశాలను పోలీసులు నిర్ధారించుకున్నారు. గతంలో అరెస్ట్ చేసిన హైదరాబాద్ కు చెందిన ఖవాజా అమ్ జద్ ను విచారించగా, సల్మాన్ చెప్పిన అంశాలు పూర్తిగా నిజమేనని ధృవీకరణ అయింది. భారత్ పై దాడులకు సంబంధించి ముజాహిద్దీన్ దళాధిపతులపై ఐఎస్ఐ- లష్కర్ కు చెందిన బాస్ ల ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోందని అమ్జద్ పోలీసులు ముందు వెల్లడించాడు.
విచారణలో సల్మాన్, అమ్ జద్ లు వెల్లడించిన అంశాల ఆధారంగా అప్రమత్తం కావాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. 'తీవ్రవాదుల కదలికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అసలు సమాచారం ఉందా లేదా మాకు తెలియదు, కానీ మాకు వచ్చిన సమాచారం మేరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం' అని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. భద్రతా బలగాలు ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ కు చెందిన కొందరు అనుమానితలను అదుపులోకి తీసుకున్నారని, త్వరలోనే మరికొందరని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు.
దుబాయి : ప్రఖ్యాత చిత్రకారుడు ఎం ఎఫ్ హుసేన్ తన పాస్ పోర్టును భారత ప్రభుత్వానికి అప్పగించారు. దోహాలోని భారత రాయబార కార్యాలయానికి ఆదివారం ఆయన పాస్ పోర్టును అందచేసారు. హుసేన్ ఇటీవలే ఖతర్ దేశ పౌరసత్వం పొందిన నేపథ్యంలో ఆయన భారత పాస్ పోర్టును వెనక్కి ఇచ్చారని స్థానిక పత్రిక గల్ఫ్ టైమ్స్ సోమవారం వార్తా కథనం ప్రచురించింది. దోహాలోని భారత రాయబారి దీపా గోపాలన్ వథ్వాతే సుమారు రెండు గంటల పాటు హుసేన్ భేటీ ఆయ్యారు. ఈ భేటీలోఆయన తన పాస్ పోర్టును భారత రాయబారి వథ్వాకు అప్పగించారు. అంతేకాకుండా ఓవరీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుకు హుసేన్ తాజాగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్డు పొందేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లును అధికారులు చేసారు.
భారత్ ద్వంద్వ పౌరసత్వాలను అనుమతించనందున హుసేన్ తన పాస్ పోర్టును వెనక్కి ఇచ్చారని రాయబారి కార్యాలయ అధికారి ఒకరు చెప్పారు. గతంలో హుసేన్ హిందూ మత దేవతల చిత్రాలను అసభ్యంగా చిత్రించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన గత నాలుగేళ్లుగా భారత్ కు రాకుండా తనను తానే దేశ బహిష్కరణ చేసుకున్నారు. దుబాయ్, లండన్ మధ్యే రాకపోకలు సాగించేవారు. ఇప్పడు ఖతర్ దేశ పౌరసత్వం తీసుకుని ఆక్కడే స్థిరపడాలని ఆయన నిశ్చయించుకున్నారు.
Loading Poll...