న్యూఢిల్లీ : విద్యారంగంలో విదేశీ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో అనుబంధ శాఖలు ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసే అవకాశం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం విదేశీ విశ్వవిద్యాలయాల బిల్లు-2010కి ఆమోదం తెలిపింది.
నాలుగేళ్ళుగా వివాదాల్లో నలుగుతున్న ఈ బిల్లుకు క్యాబినేట్ ఆమోదం లభించడంతో ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో విద్యా రంగ పురోభివృద్ధికి ఈ బిల్లు దోహదం చేస్తుందని మంత్రివర్గ సమావేశానంతరం కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. విదేశీ విశ్వవిద్యాలయాల బిల్లుపై నాలుగేళ్ళ నుంచి వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం హడావుడిగా దీనిని ఆమోదించడం చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
దీనితో గత ఏడాది ఈ బిల్లును కమిటి ఆఫ్ సెక్రటరీస్ పరిశీలించి చిన్న చిన్న మార్పులు సూచించింది. అయితే దీన్ని లెఫ్ట్ పార్టీలు సహా ఎవరూ అంగీకరించలేదు. ఉన్నట్లుండి ఈ బిల్లు మళ్ళీ తెరపైకి వచ్చి కలకలం రేపుతోంది. ఈ చట్టం ప్రకారం విదేశీ విశ్వవిద్యాలయాలు భారత ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న ఎనిమిది నెలల లోపు అనుబంధ శాఖను ఏర్పాటు చేసుకొని యుజిసి లేదా స్థానిక రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతులు పొందాలి. లేనిపక్షంలో కేంద్రం ఇచ్చిన అనుమతి రద్దవుతుంది.
విశాఖ : ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్ పరీక్షా పత్రాలు తారుమారయ్యాయి. సోమవారం విశాఖ ఉమెన్స్ కాలేజీలో అసలు సిరీస్‌కు బదులు సప్లిమెంటరీ పత్రాలను సరఫరా చేశారు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. కాగా... కరీంనగర్ మానకొండూరలో సైతం ఇదేవిధమైన గందరగోళం నెలకొంది. పరీక్ష పూర్తయిన తర్వాత జరిగిన తప్పును టీచర్లు గుర్తించారు. ఇక కర్నూలు జిల్లా కోడుమూరులో ఒక సెట్ పేపర్‌కు బదులు మరో సెట్ ేపేపర్లను ఇన్విజిలేటర్లు సరఫరా చేశారు. తప్పు తెలుసుకున్న ఎగ్జామినర్లు మళ్లీ పరీక్ష పెట్టారు.
రాజమండ్రి : అమ్మాయిలపై అబ్బాయిల యాసిడ్ దాడులు చూసాం.కానీ, ఇప్పుడు రివర్స్ గేర్ పడింది. అబ్బాయిపై అమ్మాయి యాసిడ్ దాడికి పాల్పడింది. ప్రేమించమని వేధిస్తుండటంతో అబ్బాయిలు అమ్మాయిలపై దాడులు చేసేవారు. కానీ ప్రేమించి మోసం చేసినందుకు ఓ ప్రియురాలు తన ప్రియుడుపై యాసిడ్ పోసి కక్ష తీర్చుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ ప్రియురాలు ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని కాకినాడ అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్నది కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ మార్పులకు అధిష్ఠానవర్గం అనుమతించినట్లయితే ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒకరికి అప్పగించడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. శాసనసభా నాయకురాలు, సమాచార శాఖ మంత్రి జె గీతారెడ్డి, మాజీ హోంమంత్రి కె జానారెడ్డి, పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్. ఈ ముగ్గురులో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని అంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ మార్పులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె రోశయ్య నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ కార్యక్రమాన్ని ముగించాలని ముఖ్యమంత్రి అనుకున్నా రాజకీయ వాతావరణం అనుకూలించని కారణంగా అసెంబ్లీ సమావేశాల తర్వాతకు వాయిదా వేశారు. ప్రత్యేక తెలంగాణ వాదన గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని అధిష్ఠానవర్గం భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజనపై కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటి డిసెంబర్ నాటికి తన నివేదికను ఇవ్వనుంది.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమైన పక్షంలో భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పదవిని ఎవరికి ఇవ్వాలన్నది అధిష్ఠానవర్గం నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి ముఖ్యమంత్రి పదవి దళితునికి దక్కుతుందంటూ తెరాస అధినేత కెసిఆర్ గతంలో చేసిన ప్రకటనను కూడా అధిష్ఠానవర్గం దృష్టిలో పెట్టుకునే ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలన్నది నిర్ణయించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండే వారినే రాష్ట్ర విభజన జరపాల్సి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరికి లభించే అవకాశం ఉందన్నది విశే్లషిస్తే ప్రస్తుతం మంత్రిగా ఉన్న జె గీతారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సీనియర్ మంత్రి, మహిళ అందులోను ఎస్సీ వర్గాలకు చెందిన వారు కావడం, అధిష్ఠానవర్గ ప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు ఉండటం గీతారెడ్డికి కలిసి వచ్చే అంశాలు. ముఖ్యమంత్రి రోశయ్యతో కూడా అమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. అందువల్లనే గీతారెడ్డికి శాసనసభా నాయకురాలి పదవిని ముఖ్యమంత్రి రోశయ్య కట్టబెట్టారు.
మంత్రివర్గ విస్తరణ జరిగితే కె జానారెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయ జెఎసిలో కాంగ్రెస్ తరఫున మొదట కీలక పాత్ర వహించిన జానారెడ్డి అధిష్ఠానవర్గం ఆదేశం మేరకు ఆ తర్వాత క్రమంగా జెఎసి కార్యకలాపాలకు దూరమయ్యారు. తెరాసతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలని నిర్ణయించగా అధిష్ఠానం ఆదేశం మేరకు రాజీనామాలకు దూరంగా ఉంటున్నట్లు ముందుగా జానారెడ్డి ప్రకటించారు. కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డికి సన్నిహితుడు, సీనియర్ నాయకుడు కావడం జానారెడ్డికి కలిసి వచ్చే అంశాలు.
ఇక పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ విషయానికి వస్తే ఆయన హైదరాబాద్ నుంచి స్థానిక సంస్ధల ద్వారా శాసనమండలికి జరిగే ఎన్నికల్లో ఆయన పోటీ చేయవచ్చని , ఇందుకు అధిష్ఠానవర్గం కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే నెలలో మంత్రివర్గ మార్పులు జరిగే సమయానికి శ్రీనివాస్ శాసనమండలికి ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. శ్రీనివాస్ శాసనమండలికి ఎన్నికైన పక్షంలో మంత్రివర్గంలోకి రావడం ఖాయం. అయితే శ్రీనివాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టే విషయంలో కొన్ని అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య శాసనమండలి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీనివాస్ కూడా శాసనమండలి నుంచే ఎన్నికయ్యే అవకాశం ఉందని భావిస్తున్నందున అయనకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినట్లయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు రెండూ శాసనమండలి నుంచి ఎన్నికైన వారికే దక్కుతాయి. ఇది ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి దారి తీయవచ్చు. తెరాసకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాల కారణంగా ఖాళీ అయిన స్థానాలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.
కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్న మరో వాదన ప్రకారం ముందుగానే శ్రీనివాస్‌ను మంత్రిమండలిలోకి తీసుకుని ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతారు. మంత్రిపదవి చేపట్టిన ఆరు నెలల్లో ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావలసి ఉంటుంది. ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఈ లోగానే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి నిజామాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో శ్రీనివాస్‌ను నిలబెట్టవచ్చని భావిస్తున్నారు. కానీ ఇందుకు శ్రీనివాస్ అంత సుముఖంగా లేరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ ఇదే స్థానం నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన బిజెపి అభ్యర్థి లక్ష్మీనారాయణ ఇక్కడ మళ్ళీ పోటీ చేయనున్నారు. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంటు ఎక్కువగా ఉన్నందున సహజంగానే రాజీనామా చేసిన అభ్యర్థికి అనుకూలంగానే ప్రజలు స్పందించే అవకాశం ఉందని శ్రీనివాస్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆయన అయితే శాసనమండలికి లేదంటే రాజ్యసభకు వెళ్ళాలని అభిప్రాయపడుతున్నారు.
చెన్నై: గత వారం రోజులుగా నిత్యానంద- రంజిత సెక్స్ వీడియోలతో మీడియా హోరెత్తించింది. అయితే నిత్యానంద మాత్రం ఆ వీడియోలో కన్పించింది తాను కాదనీ, అదంతా మార్ఫింగ్ మాయ అనీ ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌తో చెప్పుకొచ్చారు. తనకున్న పేరు ప్రఖ్యాతులను మంట గలిపేందుకు కొందరు పనిగట్టుకుని ఇలాంటి పనికి పూనుకున్నారన్నారు. కొన్ని మీడియా సంస్థలు కూడా వెనకా ముందు చూడకుండా ఆ వీడియోలను ప్రదర్శించి తన పరువును బజారుకీడ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారం ఒక ప్రక్కన జరుగుతుండగానే దేశంలో ఆయా ప్రాంతాలలో ఉన్న ఆశ్రమాలలో ఎనిమిదింటిపై దాడి చేసి ధ్వంసం చేశారన్నారు. తనకు శత్రువులెవరూ లేరని అనుకునే వాడిననీ, కానీ గత వారం రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే, అది నిజమేనేమోనన్న అనుమానం కలుగుతుందని చెప్పారు. తనకు ఆధ్యాత్మిక రంగం తప్పించి మరో లోకం లేదనీ, ఇప్పటివరకూ సుమారు 200 పుస్తకాలకు పైగా రాశానన్నారు. వాటిలో తాత్విక, శాస్త్రీయ కోణాలను ఆవిష్కరించే పుస్తకాలున్నాయన్నారు.
Loading Poll...