హైదరాబాద్ : ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం పెంచింది. కిలో మీటరుకు 8 నుంచి 25 పైసల వరకూ వివిధ రకాల బస్సు సర్వీసులపై ఈ పెంపును వర్తింపచేస్తున్నట్లు బుధవారంనాడు ఆర్టీసీ స్పష్టం చేసింది. పెరిగిన చార్జీలను గురువారం ఉదయం నుంచే అమలు చేయనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సు చార్జీలను కిలో మీటరుకు 8 పైసల చొప్పున, ఎక్స్ ప్రెస్ బస్సులకు 10 పైసలు, హైటెక్ (సూపర్ లగ్జరీ) సర్వీసులకు కిలో మీటర్ కు 13 పైసల చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, వోల్వో బస్సు చార్జీలు కిలో మీటర్ కు 25 పైసల చొప్పున పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అంతకు ముందు బుధవారం ఉదయం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పనిసరి పరిస్థితి ఏర్పడిందని సూచించారు. అసలే నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసి ఇప్పుడు బంద్ లు, ఆందోళనల సందర్భంగా నష్టం మరింత తడిసి మోపెడంత అయిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో ఆర్టీసీ కార్మికుల సమ్మె హెచ్చరికతో వారికి జీతాలను హెచ్చించక తప్పనిసరి పరిస్థితి కూడా తోడైందన్నారు. మరో పక్కన సంస్థలో 23 వేల పోస్టులను ఎంప్లాయిమెంట్ ద్వారా త్వరలో భర్తీ చేస్తామన్నారు. హైదరాబాద్ లో బుధవారం మంత్రి శత్రుచర్ల మీడియాతో మాట్లాడుతూ, బస్సు చార్జీలను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. డీజిల్ చార్జీలు పెరిగినప్పటికీ గత ఐదున్నర సంవత్సరాలుగా బస్సు చార్జీలను పెంచలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఎన్నో దేశాల్లో చార్జీలు పెంచినా ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే చార్జీలు పెంచలేదని, ప్రయాణికులపై భారం వేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
న్యూఢిల్లీ : హైదరాబాద్ లో తాడూ బొంగరం లేని చిరంజీవి అక్కడి సినీ పరిశ్రమ గురించి మాట్లాడే అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. అక్కడి సినీ పరిశ్రమలో ఇతరులకు లేని అభ్యంతరాలు చిరంజీవికి ఎందుకని ఆయన నిలదీశారు. సినీ పరిశ్రమపై దాడులు పెరిగాయని, రాష్ట్రంలో ఆందోళకర పరిస్థితులు కొనసాగుతూనే ఉంటే చిత్ర పరిశ్రమ చెన్నై తరలిపోతుందని ముఖ్యమంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందంటూ చిరంజీవి అన్న మాటలపై డిఎస్ కస్సున లేచారు. బుధవారం ఉదయం కేంద్ర హోంమంత్రి చిదంబరంతో భేటీ అయిన చిరంజీవి హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సినిమా యూనిట్లపై జరుగుతున్న దాడుల గురించి వివరిస్తూ, చిత్ర పరిశ్రమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో స్పష్టంచేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా చిరంజీవితో పొత్తు గురించి ప్రయత్నించిన డిఎస్ ఇప్పుడు ఆయనపై నిప్పులు చెరుగుతుండడం గమనార్హం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ చేయడం ఎంఐఎం వ్యక్తిగత అభిప్రాయమని ఒక ప్రశ్నకు డిఎస్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారని డిఎస్ అన్నారు.
Loading Poll...